అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్...
అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. వరుసగా కురుస్తున్న ఈ వానలు పత్తి, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, సోయా పంటలకు మేలు చేయనున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం వరకు నల్లగొండ జిల్లాలోని 11 మండలాల్లో 67.8 మిమీ. వర్షపా తం నమోదైంది.
ఇప్పటివరకు 282.2 మిమీ వర్షపాతం నమోదు కావాల్సి ఉం డగా 256.4 మిమీ వర్షపాతం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే -9.2 మిమీ వర్షం తక్కువగా నమోదైంది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 6.2 మిమీ వర్షపాతం నమోదైంది. 29 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా, 22 మండలాల్లో సాధరణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంతోపాటు నిర్మల్, ముథోల్, ఉట్నూర్ ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మహబూబ్‌నగర్‌తోపాటు గద్వాల, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జడ్చర్ల మండలంతోపాటు, మిడ్జిల్ మండలంలో మోస్తరు కంటే ఎక్కువ వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిశాయి. అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్, ఉప్పల్, కూకట్పల్లి ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురువగా, దిల్సుఖ్నగర్, కొత్త పేట, వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో ప్రధాన రహదారుల్లో నీరు నిలిచి చెరువులను తలపించాయి. ఈ సందర్భంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీ వర్షాలకు అవకాశం: జార్ఖండ్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి మధ్యప్రదేశ్ వద్ద బలహీనపడింది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతున్నది. దీని ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడ మో స్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌లోని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ద్రోణి ప్రభావం నాలుగు రోజులపాటు కొనసాగనున్నది. ఉత్తర బంగాళాఖాతంలో భూ ఉపరితలానికి 3.6 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి ఆవరించి ఉన్నది.