కెరీర్ ప్రారంభం నుంచి ప్రతి సినిమాకు ఎలా కష్టపడుతున్నానో ఇప్పటికీ అంతే అంకితభావంతో వర్క్ చేస్తున్నాను. ఈ ఏడాది అత్యధిక చిత్రాల్లో నటిస్తు...
కెరీర్ ప్రారంభం నుంచి ప్రతి సినిమాకు ఎలా కష్టపడుతున్నానో ఇప్పటికీ అంతే అంకితభావంతో వర్క్ చేస్తున్నాను. ఈ ఏడాది అత్యధిక చిత్రాల్లో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. దేవుడి అనుగ్రహం వల్ల తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు అన్నారు శృతిహాసన్. ఆమె నటిస్తున్న తాజా చిత్రం శ్రీమంతుడు. మహేష్ కథానాయికుడు. కొరటాల శివ రూపొందించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శృతిహాసన్ శుక్రవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి. శ్రీమంతుడులో మీ పాత్ర ఎలా వుంటుంది? నా పాత్ర పేరు చారుశీల. స్వతంత్రంగా ఆలోచించే ఆత్మైస్థెర్యం గల అమ్మాయి. ఉన్నతమైన భావాలున్న తెలివైన అమ్మాయిగా కనిపిస్తాను. నాకు బాగా నచ్చిన పాత్ర ఇది. కెరీర్లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేశాను. అయితే వాటన్నింటికి పూర్తి భిన్నంగా చారుశీల పాత్ర చాలా కొత్తగా వుంటుంది. సినిమాలో ఊరి నుంచి చాలా తీసుకున్నారు. తిరిగి ఇవ్వకపోతే లావైపోతారు అంటున్నారు మరి మీ సొంత ఊరు చెన్నై కోసం ఏమిస్తున్నారు? నేను చెన్నైలో పుట్టాను. అక్కడే పెరిగాను. మా నాన్నది చెన్నై. అమ్మది ముంబై. హైదరాబాద్ నాకు మూడోఇల్లు లాంటిది. అందుకే చెన్నై ఒకటే నా సొంత ఊరని చెప్పలేను. మహేష్‌తో గతంలో ఓ సినిమా చేయాల్సింది చేయలేకపోయారు. తాజాగా శ్రీమంతుడు చిత్రంలో కలిసి నటించడం ఎలా అనిపిస్తోంది? మహేష్‌తో సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఇటీవల ఆగడులో ఒక ప్రత్యేక గీతంలో కనిపించాను. అయితే శ్రీమంతుడులో కథానాయికగా ఆయనతో కలిసి నటించడం సరికొత్త అనుభూతినిచ్చింది. మహేష్‌లో నేను పెద్ద స్టార్‌ని అన్న భావన ఎక్కడా కనిపించదు. సెట్లో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ చాలా క్రమశిక్షణతో మెలిగేవారు. అందువల్లే ఆయన ఈ రోజు ఈ స్థాయిలో వున్నారు. సినిమాలో జగపతిబాబు, సుకన్య వంటి సీనియర్ నటులతో కలిసి నటించడం వల్ల వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమా మహేష్ కోసం ఒప్పుకున్నారా? లేక పాత్ర నచ్చి అంగీకరించారా? సంప్రదాయంగా కనిపిస్తూనే మోడ్రన్‌గా ఆలోచించే పాత్ర కావడంవల్లే ఈ సినిమాకు అంగీకరించాను. శ్రీమంతుడు ఆడియోలో మీకు బాగా నచ్చిన పాట? ఈ ఆల్బమ్‌లో జత కలిసే.. అంటూ సాగే పాటంటే నాకు చాలా ఇష్టం. ఈ పాటను చిత్రీకరించిన తీరు కూడా నన్నెంతగానో ఆకట్టుకుంది. ప్రతి సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలుంటాయి. అయితే ఈ సినిమాలో మాత్రం అవి చాలా కొత్తగా వుంటాయి. ఇంతకు ముందు మీది ఐరెన్‌లెగ్ అనేవారు కానీ ఇప్పుడు గోల్డెన్ లెగ్ అంటున్నారు? ప్లీజ్ ... గోల్డెన్ లెగ్, సిల్వర్ లెగ్ అంటూ పేర్లు పెట్టి పిలవకండి. ఇది జ్యువెల్లరీ ఇండస్ట్రీ కాదు. సినిమా ఇండస్ట్రీ. ప్రేక్షకులు నా నటనను మెచ్చుకుంటే అంతే చాలు అదే నాకు ఆనందం. ఈ ఏడాది దాదాపు ఎనిమిది చిత్రాల్లో నటిస్తుండటం ఎలా అనిపిస్తోంది? కెరీర్ ప్రారంభం నుంచి ప్రతి సినిమాకు ఎలా కష్టపడుతున్నానో ఇప్పటికీ అంతే అంకితభావంతో పనిచేస్తున్నాను. ఈ ఏడాది అత్యధిక చిత్రాల్లో నటిస్తున్నందుకు ఆనందంగా వుంది. దేవుడి అనుగ్రహం వల్ల తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. శ్రీమంతుడులో అవకాశం రావడం ఎలాంటి అనుభూతినిచ్చింది? శ్రీమంతుడులో నాకు అవకాశం దక్కడం చాలా ఆనందంగా వుంది. నేను ఇప్పటి వరకు చేసిన చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపిస్తాను. చాలా రోజుల తరువాత ఓ గ్రేట్ టీమ్‌తో.. మంచి దర్శకుడితో పనిచేశానన్న అనుభూతి కలిగింది. కొరటాల శివతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? కొరటాల శివ సెన్సిబుల్ డైరెక్టర్. సెట్లో అందరితో ఈజీగా కమ్యూనికేట్ చేసేవారు. కామ్‌గా వుంటూనే తనకు కావాల్సింది మా దగ్గరి నుంచి కూల్‌గా రాబట్టుకునేవారు. సెట్లో ఆయనొక స్వీటెస్ట్ టీచర్. మహేష్‌బాబు చాలా అందగాడు. అతనితో నటిస్తున్నప్పుడు మిమ్మల్ని డామినేట్ చేస్తున్నట్టు ఏమైనా ఫీలయ్యారా? మహేష్ మంచి అందగాడు(నవ్వుతూ). అయితే ఇది సినిమా. నేను ఏమైనా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నానా? ఫీలవడానికి. తమిళ చిత్రం పులి కోసం విజయ్‌తో కలిసి ఓ పాట పాడారు. మరి ఈ సినిమా కోసం దేవీశ్రీప్రసాద్ మీ చేత ఎందుకు పాడించలేదు? అది దర్శకుడు కొరటాల శివను అడిగితే బాగుంటుంది. దక్షిణాది క్రేజీ కథానాయికల్లో ఒకరిగా మీకు పేరుంది. దాన్ని మీరు ఎలా కాపాడుకోవాలనుకుంటున్నారు? చిన్నతనం నుంచి ఇప్పటి వరకు అమ్మనాన్నల కెరీర్‌ని నిశితంగా గమనించాను. ఫేమ్ అన్నది వస్తుంది పోతుంది. అది నాకు ముఖ్యం కాదు. ప్రాధాన్యత వున్న పాత్రలు, ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే పాత్రలు చేయాలన్నదే నాకు ముఖ్యం. నాన్న మంచి సినిమా చేసినప్పుడు చాలా మంది ప్రేక్షకులు అభినందించారు, ఆదరించారు. అదే సినిమా బాగా లేకపోతే విమర్శించారు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. కమల్ మీ సినిమాలు చూసి ఏమైనా సలహాలు ఇస్తుంటారా? లేదు. నా సినిమాలు చూడాలా?వద్దా? అన్నది ఆయన ఇష్టం. ఖచ్చితంగా చూడాలన్న నిబంధన ఏమీ లేదు కదా? నా సినిమాల విషయంలో నాన్న అస్సలు ఇన్వాల్వ్ కారు. నీ జీవితం నీ ఇష్టం అని మాత్రమే చెబుతారు. ప్రతి ఆర్టిస్ట్ జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి. నాన్నగారు ఈ రోజు ఈ స్థాయిలో వున్నారంటే దానికి ఆయనపడ్డ కష్టమే కారణం. ఓ స్టార్ కొడుకు లేదా కూతురు చిత్ర పరిశ్రమలోకి సులువుగా రావొచ్చు. అయితే ఇక్కడ నిలదొక్కుకోవడం అన్నది మాత్రం మన టాలెంట్ మీదే ఆధారపడి వుంటుంది. నేనయినా...చరణ్, రణభీర్ అయినా కష్టపడాల్సిందే. దర్శకత్వం వహించాలన్న ఆలోచన ఏమైనా వుందా? అలాంటి ఆలోచన నాకు లేదు. దర్శకత్వం అన్నది చాలా బాధ్యతాయుతమైనది. దాన్ని నిర్వర్తించడం చాలా కష్టం. మీ చెల్లెలు అక్షరకు సలహాలు, సూచనలు ఏమైనా ఇస్తుంటారా? లేదు. మీ జీవితం మీ ఇష్టం. మీకు సంబంధించిన నిర్ణయాలు మీరే తీసుకోవాలని మా తల్లిదండ్రులు చెప్పారు. దాన్నే మేము అనుసరిస్తున్నాం. బాలీవుడ్లో మహిళాప్రధాన చిత్రంలో నటిస్తున్నారని తెలిసింది? (నవ్వుతూ) హీరోయిన్ ఓరియెంటెడ్, హీరో ఓరియెంటెడ్, విలన్ ఓరియెంటెడ్ సినిమాల్లో మాత్రమే నటించాలన్న నియమనిబంధనలేమీ పెట్టుకోలేదు. పాత్ర నచ్చి నేను బాగా ఫీలయితే ఎలాంటి సినిమా చేయడానికైనా నేను సిద్ధమే. తదుపరి చిత్రాలు? చాలా వున్నాయి. అయితే అవన్నీ ప్రస్తుతం చర్చల దశలో వున్నాయి.