కుట్రలు ఇక చెల్లవు.. ఉమ్మడి రాష్ట్రం ఉన్నన్నినాళ్లు తెలంగాణకు గోదావరి, కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కకుండా అడ్డం పడ్డారు. ఇపుడు మన ...
కుట్రలు ఇక చెల్లవు..
-టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
బాబు పూర్తి చేస్తానన్న ప్రాజెక్టులే కదా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నపుడు అధికారంలోకి వస్తే పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు పూర్తి చేస్తానని చంద్రబాబే చెప్పిండ్రు. విభజన జరుగగానే ఈ రెండు ప్రాజెక్టులు కొత్తవైనవా? ఈ రెండు కొత్తవైతే... మరి పట్టిసీమ ఏ ప్రాజెక్టు? వరద జలాలపై రూపొందించిన ప్రాజెక్టులు కాబట్టి వరద వస్తేనే నీళ్లు తీసుకుంటం. చంద్రబాబుకు ఎందుకు బాధ కలుగుతుందో అర్థం కావడం లేదు.
- ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల వేదిక ప్రధాన కార్యదర్శి
సాధ్యాసాధ్యాలు చూసుకున్నంకనే జీవోల జారీ
పాలమూరు, డిండి పథకాలకు ఉమ్మడి ప్రభుత్వంలో ఫీజుబులిటీ కోసం జీవోలు ఇచ్చారని అనడం నిజం కాదు. అన్ని అధ్యయనాలు చేసిన తర్వాతే జీవోలు జారీ చేశారు. వరద జలాలపై అధ్యయనం చేసినాకే పాలమూరుకు రోజుకు రెండు టీఎంసీల చొప్పున 30 రోజుల్లో 60 టీఎంసీలు తీసుకోవచ్చని జీవో వచ్చింది. డిండి కూడా అంతే. చంద్రబాబునాయుడు 2009, 2014 ఎన్నికల్లో ఈ ప్రాజెక్టులపై హామీలు ఇచ్చిన విషయం మరిస్తే ఎట్లా?
- చంద్రమౌళి, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల వేదిక అధ్యక్షుడు
వక్రీకరించడం మంచిది కాదు
పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఉమ్మడి ప్రభుత్వంలోనే జీవో వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అంచనాలు రూపొందించేందుకు ఎస్కి-ఇంజినీర్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు బాధ్యతను అప్పగించేందుకు మాత్రమే జీవో ఇచ్చింది. ఇక జూరాల శ్రీశైలం అంటూ దాన్నో వివాదాస్పద అంశంగా చేయడం విడ్డూరం. సాగునీటి ప్రాజెక్టులు ఏవైనా అవి పూర్తయ్యే వరకు అనేక కారణాలతో మార్పు చేర్పులు జరుగుతాయి.
- రామలింగారెడ్డి, రిటైర్డ్ ఇంజినీర్
టీడీపీ నాయకులను గ్రామాలలో తిరుగనియ్యం
తెలంగాణ ప్రాజెక్టులను టీడీపీ అడ్డుకోవడం సిగ్గుచేటు. ఇది మానుకోకుంటే టీడీపీ నాయకులను గ్రామాలలో తిరుగనియ్యం. లక్షలాది రైతు కుటుంబాలు బాగుపడే వీటికి అడ్డుపడితే రైతుల ఉసురు ముడుతుంది.
- శ్రీను, రైతు, టంకర గ్రామం, హన్వాడ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా
టీడీపీ కపట ప్రేమకు నిదర్శనం...
పాలమూరు ప్రాజెక్ట్‌ను టీడీపీ అడ్డుకుంటుండంతో చంద్రబాబుకి తెలంగాణపై ఉన్న కపట ప్రేమ బయటపడింది. తెలంగాణ టీడీపీ నాయకులు ఇంకా సీమాంధ్ర పార్టీని పట్టుకుని వేలాడుతుండడం ఏం బాగలేదు.
- మీసాల నర్సింహులు, రైతు, గట్టు. మహబూబ్‌నగర్ జిల్లా
కుట్రకు పాల్పడుతున్న టీడీపీ ..
చంద్రబాబు అధికారంలో ఉన్న రోజుల్లో ఆర్డీఎస్ను సీమాంధ్ర నాయకులు బాంబులతో పేల్చివేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రాజెక్టులు కడితే అడ్డుకుంటున్నడు.తెలంగాణ రైతులపై టీడీపీ నేతలకు నిజంగా అభిమానం ఉంటే కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి.
-భీమన్న, రైతు, పులికల్, అయిజ మండలం. మహబూబ్‌నగర్ జిల్లా
టీడీపీని తెలంగాణలో భూస్థాపితం చేయాలి...
పాలమూరు- రంగారెడ్డి నిర్మాణం జరిగితే రైతుల పొలాలు సస్య శ్యామలం అవుతాయి. ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలు మానుకోకుంటే టీడీపీని తెలంగాణలో భూస్థాపితం చేయాలి.
- దశరథ, రైతు దేవరకద్ర. మహబూబ్‌నగర్ జిల్లా
టీ టీడీపీ నేతలు బుద్ధితెచ్చుకోవాలి..
చంద్రబాబు సీడబ్ల్యూసీకి లేఖ రాయడం దుర్మార్గపు చర్య. రాష్ట్రం వేరైనా ఇంకా తెలంగాణపై ఆయన కక్ష పోలేదు. ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి. టీ టీడీపీ నేతలకు ఇప్పటికైనా జ్ఞానోదయం రావాలి.
- ఎం.నర్సింహులు, కాంగ్రెస్ నేత, ఆరగిద్ద, మహబూబ్‌నగర్ జిల్లా