హైదరాబాద్ : ఐటీ, హార్డ్‌వేర్, పరిశోధన-అభివృద్ధి, శిక్షణ, ఇతర సేవారంగాల్లో హైదరాబాద్ నగరం మరోసారి తన ప్రత్యేకతను చాటుకునే అవకాశం దక్కించ...
హైదరాబాద్ : ఐటీ, హార్డ్‌వేర్, పరిశోధన-అభివృద్ధి, శిక్షణ, ఇతర సేవారంగాల్లో హైదరాబాద్ నగరం మరోసారి తన ప్రత్యేకతను చాటుకునే అవకాశం దక్కించుకున్నది. ఆయా రంగాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఏఐటీ) ఐటీ ఆసియా-2015 పేరుతో నిర్వహించనున్న సదస్సుకు భాగ్యనగరం వేదిక కానుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. ఈ సందర్భంగా ఐటీ, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన భారీ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేయనున్నారు.
-సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు వేదిక కానున్న నగరం
-ఐటీ, హార్డ్‌వేర్, అనుబంధ రంగాలతో భారీ ఎగ్జిబిషన్
-సదస్సుతో హైదరాబాద్‌కు మరింత ఖ్యాతి: జయేశ్‌రంజన్
ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి కంపెనీలు తరలిరానున్నాయని ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ఎంఏఐటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్వర్ షిర్పుర్వాలా తెలిపారు. గురువారం వారు మీడియాతో మాట్లాడారు. ఐటీ ఆసియా-2015 సదస్సు ద్వారా హైదరాబాద్‌లో బయో మెడికల్, ఎలక్ట్రానిక్స్, సెల్యులార్ కమ్యూనికేషన్స్, ఐటీ హార్డ్‌వేర్ పరిశ్రమల వృద్ధికి అవకాశాలు పెరుగుతాయని జయేశ్‌రంజన్ తెలిపారు. నగరంలో ఐటీఐఆర్తోపాటు రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇప్పటికే ఉన్న సదుపాయాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్తమ పారిశ్రామిక విధానం వల్ల పెట్టుబడిదారులకు తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా మారిందని అన్నారు. అన్వర్ షిర్పుర్వాలా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం, ఐటీ ఆసియా-2015కు వేదికగా హైదరాబాద్‌ను ఎంచుకోవడం సంతోషకరమన్నారు.
మేక్ ఇన్ ఇండియా ఆలోచనతో ఎంఏఐటీ పనిచేస్తున్నదని తెలిపారు. తెలంగాణలో ఐటీ పరిశ్రమ వృద్ధిలో పాలుపంచుకొనేందుకు ప్రపంచంలోని ఎన్నో కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని, ఐటీ ఆసియా సదస్సు ద్వారా తెలంగాణకు మరింతగా ప్రచారం లభిస్తుందని అన్నారు. సదస్సుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు, ఐటీ రంగ నిపుణులు హాజరవుతారని చెప్పారు.
పారిశ్రామికాభివృద్ధికి ఊతం.. ఎంఏఐటీ
శాస్త్ర, సాంకేతిక, విద్యా, ఐటీ పరిశ్రమలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో 1982లో ఎంఏఐటీ ఏర్పడింది. దేశంలోని ఐటీ, హార్డ్‌వేర్, శిక్షణ, పరిశోధన, అభివృద్ధి, సేవల రంగాలకు ప్రాతినిథ్యం వహిస్తూ అంతర్జాతీయంగా పోటీపడగల ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసింది. ఐటీ ఆసియా-2015 అత్యంత కీలక వ్యాపారవేత్తలతో కూడిన ప్రముఖ వేదిక. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అందించడం, ముఖాముఖి సంప్రదింపులకు అవకాశం ఇవ్వడం, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల అనుసంధానానికి వేదిక కానుంది.