- గుడుంబాపై ముప్పేట దాడి - ప్రభుత్వ ఆదాయం తగ్గినాసరే ప్రజారోగ్యమే ముఖ్యం - ఆల్కహాల్ శాతం ప్రభుత్వం అదుపులో.. - గుడుంబా తయారీదార...
- గుడుంబాపై ముప్పేట దాడి
- ప్రభుత్వ ఆదాయం తగ్గినాసరే ప్రజారోగ్యమే ముఖ్యం
- ఆల్కహాల్ శాతం ప్రభుత్వం అదుపులో..
- గుడుంబా తయారీదారులపై పీడీయాక్టు
- ఆబ్కారీశాఖ కఠినంగా వ్యవహరించాలన్న సీఎం కేసీఆర్
- 15 తర్వాత కొత్త విధానానికి నోటిఫికేషన్
- డిపార్టుమెంటుగా బేవరేజ్ కార్పొరేషన్
- పాతవిధానంలోనే దుకాణాలకు లైసెన్స్‌లు
- ఎక్సైజ్ పాలసీ ముసాయిదాపై ముఖ్యమంత్రి సమీక్ష
ప్రజల ప్రాణాలను హరిస్తున్న గుడుంబా మహమ్మారిని గ్రామాలనుంచి తరిమికొట్టేందుకు బహుముఖ వ్యూహంతో యుద్ధం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఇదే ప్రధాన లక్ష్యంగా కొత్త ఆబ్కారీ విధానాన్ని అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. మద్యం విధానంలో ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా ఉండాలని, ఆదాయం తగ్గినా ఫర్వాలేదని ఆయన స్పష్టం చేశారు. గుడుంబాను నిర్మూలించడానికి తక్కువ ధరకు ఆమోదయోగ్యమైన చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు.
తక్కువ ధరకే మద్యం లభిస్తే ప్రజలు గుడుంబా జోలికి పోరన్న నమ్మకం తనకు ఉందని విశ్వాసం వ్యక్తంచేశారు. గుడుంబా తయారీదారులను గుర్తించి, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించాలని చెప్పారు. నూతన ఎక్సైజ్ విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో శుక్రవారం సమీక్ష జరిపారు. అధికారులు రూపొందించిన కొత్త మద్యం విధానానికి ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. కొత్త విధానానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆగస్టు 15 తర్వాత జారీచేయాలని సమావేశంలో నిర్ణయించారు. అక్టోబర్ 1నుంచి నూతన మద్యం విధానాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. సామాన్య ప్రజల పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తున్న గుడుంబా మహమ్మారిపై యుద్ధం ప్రకటించి, గ్రామాలు, తండాల నుంచి దానిని తరిమికొట్టాలని ఆబ్కారీ, పోలీస్ అధికారులకు సీఎం ఈ సందర్భంగా సూచించారు.
గుడుంబా వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది మరణిస్తున్నారు. అనేక సామాజిక అనర్థాలు కూడా జరుగుతున్నాయి. కాయకష్టం చేసి, మద్యంతో సేదదీరే వారికోసం గుడుంబాకు ప్రత్యామ్నాయంగా ప్రాణహానిలేని మద్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రభుత్వమే బాటిళ్లద్వారా చీప్ లిక్కర్‌ను అందించాలి. గ్రామీణ ప్రాంతాలలో మండలం యూనిట్‌గా తీసుకుని లైసెన్స్‌లు ఇవ్వాలి. లైసెన్స్‌లు పొందిన వారు మండలంలోని గ్రామాలలో చీప్ లిక్కర్ అమ్ముకోవడానికి పర్మిట్లు ఇవ్వాలి. చీప్‌లిక్కర్ అమ్మకాల వల్ల ప్రభుత్వానికి ఆదాయం తక్కువగానే వస్తుంది. అయినాసరే ఆదాయంతో పనిలేదు. ప్రజల ఆరోగ్యం కాపాడటమే ముఖ్యం. కుటుంబాలు చల్లగా ఉండాలి.
ఆరోగ్యంగా బతకాలి. తక్కువ ధరలోనే చీప్ లిక్కర్ అందుబాటులో ఉంటే గుడుంబా ఎవరూ తాగరనే నమ్మకం నాకున్నది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చీప్‌లిక్కర్ తయారవుతుంది కాబట్టి ఎంత మోతాదులో ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటే ఎక్కువ హాని జరుగదో శాస్త్రీయంగా నిర్ధారించడానికి వీలవుతుంది అని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రస్తుత పద్ధతిలోనే మద్యం షాపులకు లైసెన్సులు
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రమంతా ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీపద్ధతి ద్వారానే మద్యం దుకాణాలకు లైసెన్స్లివ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం మద్యం సరఫరా చేస్తున్న తెలంగాణ బేవరేజి కార్పొరేషన్ లిమిటెడ్‌ను రద్దుచేసి ప్రత్యేక డిపార్ట్మెంట్గా మార్చాలని, సీనియార్టీ ఉన్న రిటైర్డ్ అధికారుల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. డీఐజీస్థాయి పోలీస్ అధికారిని ఒకరిని ఆబ్కారీశాఖలో నియమించాలని కూడా సమావేశం నిర్ణయించింది. గుడుంబాకు ప్రత్యామ్నాయంగా చీప్‌లిక్కర్ ప్రవేశపెట్టడమేకాకుండా గుడుంబాను నివారించడంలో కఠినంగా వ్యవహరించకుంటే ఫలితాలు ఉండవని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
బహుముఖ వ్యూహంతో గుడుంబాపై దాడి
గుడుంబాపై దాడికి బహుముఖ వ్యూహం అనుసరించాలని ముఖ్యమంత్రి చెప్పారు. చీప్‌లిక్కర్ ప్రవేశపెట్టడంతోపాటు కల్తీ జరుగకుండా చూడాలి. గ్రామాల్లో గుడుంబా తయారుచేసేవారి దగ్గరినుంచి అమ్మకాలు జరిపే వరకూ ఒక నెట్వర్క్ ఉంది. ఆ నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయాలి. గుడుంబా తయారీదారులపై అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించాలి అని చెప్పారు. కొన్ని ప్రాంతాలు గుడుంబా తయారీకి ప్రసిద్ధి చెందాయని, ఆబ్కారీ శాఖ నిర్లక్ష్యంకూడా గుడుంబా వ్యాపారం యథేచ్చగా సాగటానికి కారణమవుతున్నదని సీఎం అన్నారు. ఇకపై ఎవరూ నిర్లక్ష్యంగా ఉండవద్దు. గుడుంబా తయారీదారులను గుర్తించాలి. సూత్రధారులను పట్టుకోవాలి.
ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాలి. పోలీసు, ఎక్సైజ్ శాఖలు ఈ విషయంలో కలిసి పని చేయాలి అని సీఎం స్పష్టంచేశారు. గుడుంబా వల్ల కలిగే అనర్థాలపై షార్ట్ఫిలిమ్స్, పోస్టర్లు, కరపత్రాలు, సాంస్కృతిక సారథి కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. గుడుంబా స్థావరాలపై వివరాలు ఇచ్చేవారికి అవార్డులు ఇవ్వాలని, ఆర్డీవోలు, తహసీల్దారులు గుడుంబా వ్యతిరేక విధానాన్ని అమలు చేసే విషయంలో క్రియాశీలకంగా పని చేయాలని సీఎం చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధికారులు సమావేశమై వ్యూహాన్ని ఖరారు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో ఆబ్కారీ మంత్రి టీ పద్మారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా, కమిషనర్ చంద్రవదన్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సీఎం అదనపు ముఖ్యకార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.