TS ACB వర్సెస్ AP CID. రాష్ట్రంలో ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓటుకు నోటు కేసు మళ్లీ అలజడి రేపుతోంది. నోటీసులు జారీ అయిన డ్రైవర...
TS ACB వర్సెస్ AP CID. రాష్ట్రంలో ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓటుకు నోటు కేసు మళ్లీ అలజడి రేపుతోంది. నోటీసులు జారీ అయిన డ్రైవర్లు, గన్ మెన్లు కేటీఆర్, లోకేష్ లకు సంబంధించినవాళ్లు కావడం పొలిటికల్ హీట్ రాజేస్తోంది.
సైలెంటైపోయిందనుకున్న ఓటుకునోటు కేసు ఒక్కసారిగా మళ్లీ సంచలనం రేపింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఇచ్చిన యాభై లక్షల డబ్బు ఎక్కడివనే దానిపై రాష్ట్ర ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మేడిపల్లి కొండల్ రెడ్డి అనే కార్ డ్రైవర్ కు రాష్ట్ర ఏసీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. ఇవాళ ఎట్టిపరిస్థితుల్లో ఏసీబీ ఆఫీసులో విచారణకు రావాలని ఆదేశించారు. కొండల్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబు కొడుకు లోకేశ్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అతనికి నోటీసులిచ్చేందుకు మొన్న రాత్రి టీడీపీ ఆఫీస్ కు, చంద్రబాబు ఇంటికి వెళ్లారు ఏసీబీ అధికారులు. రెండు చోట్లా లేడని తెలిసి… నిన్న వెంకటగిరి లోని కొండల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అతను కనిపించకపోవడంతో… ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు.
ఇది జరిగిన గంటల్లోనే ఏపీ సీఐడీ అధికారులు కూడా స్పందించడం అలజడి రేపింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చెప్పాలని టీఆర్ఎస్ నేతలు తనపై ఒత్తిడి చేశారని కేసులో నిందితుడు మత్తయ్య జెరూసలేం విజయవాడలో కంప్లయింట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ అధికారులు, పోలీసులు … డ్రైవర్ సత్యనారాయణ, గన్ మన్ జానకీరాంలను విచారణకు రావాలని నోటీసులు జారీచేశారు. వీరిద్దరు రాష్ట్ర మంత్రి కేటీఆర్ దగ్గరే పనిచేస్తున్నారు. ఇద్దరికీ నోటీసులు ఇచ్చేందుకు నిన్న సాయంత్రం బేగంపేటలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ లేకపోవడంతో.. బంజారాహిల్స్ లోని కేటీఆర్ ఇంటికి వెళ్లారు. అక్కడా కనిపించకపోవడంతో… ఇవాళ వారి ఇళ్లల్లో వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. బంజారాహిల్స్ లోని నేషనల్ సెక్యూరిటీ వింగ్ లోకి వెళ్లి డ్రైవర్, గన్ మన్ ల అడ్రస్, వివరాలపై ఆరా తీశారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారుల దగ్గర డ్రైవర్లుగా పనిచేసే వారికి… గన్ మెన్ కు నోటీసులు జారీ కావడం రాజకీయవర్గాల్లో చర్చకు కారణమవుతోంది.