-ట్రిబ్యునల్ ఆదేశాలతో కదలిన యంత్రాంగం -కమలనాథన్ కమిటీ షరతులకు అనుగుణంగా ప్రక్రియ -రేపు తుది జాబితా ప్రకటన! -డిప్యూటీలకు తహసీల్దార...
-ట్రిబ్యునల్ ఆదేశాలతో కదలిన యంత్రాంగం
-కమలనాథన్ కమిటీ షరతులకు అనుగుణంగా ప్రక్రియ
-రేపు తుది జాబితా ప్రకటన!
-డిప్యూటీలకు తహసీల్దార్లుగా..
ఎమ్మార్వోలకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్
హైదరాబాద్ : రాష్ట్రప్రభుత్వానికి కీలకమైన రెవెన్యూశాఖలో పదోన్నతులకు మార్గం సుగమమైంది. గతంలోనే ప్రభుత్వం పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించినా, అర్హుల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ కొంతమంది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు వెళ్లడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే అన్ని విషయాలను పరిశీలించిన ట్రిబ్యునల్ పదోన్నతులకు అర్హులైనవారి పేర్లతో తుది జాబితాను వెల్లడించాలని ఆదేశించింది. దీంతో పదోన్నతుల ప్రక్రియకు లైన్‌క్లియర్ అయింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని నడిపించేది రెవెన్యూ విభాగమే. మండల స్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే ఈ కీలక శాఖలో చాలాకాలంగా పదోన్నతులు ఆగిపోయాయి.
తహసీల్దార్లుగా పదోన్నతులు పొందాల్సిన అనేకమంది డిప్యూటీలుగానే కొనసాగుతున్నారు. వీరిలో చాలామంది పదవీ విరమణకు దగ్గరయ్యారు. రాష్ట్ర విభజన జరిగి ఏడాది దాటినా పదోన్నతులు రాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నెలరోజుల క్రితం పదోన్నతులు ఇవ్వడానికి అంగీకరించారు. ఈ మేరకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం తయారుచేసిన పదోన్నతుల జాబితా (ప్రొవిజనల్ లిస్ట్)పై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారు సీసీఎల్ఏలో అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో పదోన్నతుల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. పదోన్నతులకు సంబంధించిన ప్రాతిపదికపై ప్రభుత్వం ట్రిబ్యునల్‌లో వివరణ ఇచ్చింది. తాము తుది జాబితాను ఇంకా ప్రకటించలేదని, ప్రొవిజనల్ లిస్ట్‌ను మాత్రమే వెల్లడించి, అభ్యంతరాలుంటే తెలియజేయాలని కోరామని చెప్పింది. ఈ వాదనతో సంతృప్తిచెందిన ట్రిబ్యునల్ తుది జాబితాను ప్రకటించాలని ఆదేశించింది. దీంతో పదోన్నతుల ప్రక్రియకు లైన్ క్లియర్ అయినట్లయింది. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు సీసీఎల్ఏ మంగళవారం నాడు అర్హుల తుది జాబితాను ప్రకటించనున్నట్టు తెలిసింది. ఫైనల్లిస్ట్ను ప్రకటించిన తరువాత వీలైనంత త్వరగా డీపీసీ ఏర్పాటుచేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ ప్రక్రియపూర్తయితే డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతులు వస్తాయి.
తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు: రాష్ట్ర ప్రభుత్వం తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇవ్వడానికి సుముఖంగా ఉంది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు తహసీల్దార్లకు పదోన్నతులు కల్పించలేదు. కమలనాథన్ కమిటీ పూర్తిస్థాయిలో ఉద్యోగుల విభజన చేయకపోవడంతో ప్రభుత్వానికి పదోన్నతులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొంతమంది తహసీల్దార్లు అవకాశం ఉండి పదోన్నతులు పొందకుండానే పదవీ విరమణ చేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు తమకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కమలనాథన్ కమిటీ షరతులకు లోబడి పదోన్నతులు చేపట్టాలని కోరారు. షరతుల ప్రకారం వ్యవహరించడానికి అభ్యంతరం లేదని భావించిన సర్కారు, రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి మాత్రమే పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ షరతుల ప్రకారం 25 నుంచి 30 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు రానున్నాయి.