-పక్కా ప్రణాళికతో సింగరేణి.. 95% పనులు పూర్తి - 1200 మె.వా. విద్యుత్ ఉత్పత్తికి చురుగ్గా పనులు - జనవరిలోనే అందుబాటులోకి 600 మెగావాట...
-పక్కా ప్రణాళికతో సింగరేణి.. 95% పనులు పూర్తి
- 1200 మె.వా. విద్యుత్ ఉత్పత్తికి చురుగ్గా పనులు
- జనవరిలోనే అందుబాటులోకి 600 మెగావాట్లు
- సీఎం సూచనలతో రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న ఇంజినీర్లు
హైదరాబాద్:సింగరేణి తన కాళ్ళపై తాను నిలబడటమే కాకుండా.. రాష్ర్టానికి అవసరం ఉన్నప్పుడు ఆదుకునే దిశగా అడుగులేస్తున్నది. పక్కా ప్రణాళిక, పకడ్బందీ పర్యవేక్షణ, నిరంతర శ్రమ.. వెరసి రాష్ర్టానికి వచ్చే మార్చికల్లా 1200 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తేనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముందుచూపుతో తీసుకున్న చర్యలు.. సీఎం సూచనలకు అనుగుణంగా పక్కా ప్రణాళిక అమలు చేస్తున్న సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ నిరంతర పర్యవేక్షణ.. ఇంజినీర్ల బృందం కృషితో మార్చికల్లా ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ కేంద్రంలోని రెండు యూనిట్లనుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు.
జనవరిలో మొదటి యూనిట్.. మార్చిలో రెండోది
ఆదిలాబాద్ జిల్లా జైపూర్ సమీపంలో నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ముఖ్యమైన బాయిలర్ లైటప్‌లను అనుకున్నట్టుగానే ప్రారంభించారు. మొదటి యూనిట్ బాయిలర్‌ను జూలైలో లైటప్ చేయగా.. రెండో యూనిట్ బాయిలర్‌ను సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ గురువారం లైటప్ చేశారు. దీనితో జైపూర్ ప్లాంటునుంచి వచ్చే మార్చివరకు 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నది.
7500 కోట్లు.. 1200 మెగావాట్ల సామర్థ్యం
జైపూర్వద్ద సింగరేణి ఆధ్వర్యంలో సొంతంగా రూ.2991 కోట్ల ఖర్చుతో 600 మెగావాట్ల (యూనిట్-1) థర్మల్ కేంద్రం నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు, నీరు ఇతర వనరులు స్థానికంగా అందుబాటులో ఉన్న నేపథ్యంలో మరో 600 మెగావాట్ల (యూనిట్-2)ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనితో రెండు యూనిట్ల ఖర్చు సుమారు రూ.7500 కోట్లకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటివరకు 95% పూర్తయ్యాయి. వనరుల లభ్యతతో మరో 600 మెగావాట్లతో మూడో యూనిట్ నిర్మాణ పనులను రూ.3470 కోట్లతో చేపట్టారు.
95% పనులు పూర్తి
థర్మల్ కేంద్రం నిర్మాణంలో బీటీజీ (బాయిలర్, టర్బయిన్, జనరేటర్) పనులు చాలా ముఖ్యమైనవి. ఇందులో ఇప్పటికే 95% పనులు పూర్తయ్యాయి. మొదటి యూనిట్‌కు సంబంధించిన డ్రమ్ లిఫ్టింగ్, కండెన్సర్ ఎరక్షన్, హైడ్రో పరీక్షలు దాదాపు పూర్తి చేశారు. ఇటీవల ఎల్డీవో ప్లాంట్, డీఎం ప్లాంట్, ఎయిర్ కంప్రెషన్ సిస్టం, ఫైర్ ఫైటింగ్ సిస్టం, ఫ్యూయల్ ఆయిల్ పంప్ సిస్టం, ఐడీ ఫ్యాన్, ఎఫ్డీ ఫ్యాన్ నిర్మాణాలు పూర్తయ్యాయి.
ముఖ్యమైన 275 అడుగుల ఎత్తైన చిమ్నీ నిర్మాణంకూడా పూర్తిచేశారు. ఇదేకాకుండా.. 132 కేవీ స్విచ్‌యార్డు పనులు, స్టేషన్ యాగ్జిలరీ కూలింగ్ వాటర్ సిస్టంవంటి 13రకాల నిర్మాణాలు, వ్యవస్థల అనుసంధానం పూర్తి అయ్యాయి. రెండో యూనిట్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలన్నీకూడా నిర్దిష్ట కాలంలో పూర్తిచేయడంతో గురువారం లైటప్ నిర్వహించారు. మరో ప్రధాన ఘట్టమైన సింక్రనైజేషన్ (అనుసంధాన ప్రక్రియ) యూనిట్-1లో అక్టోబర్‌లో, యూనిట్-2లో నవంబరులో చేపట్టనున్నారు. చివరి దశ అయిన కమర్షియల్ ఆపరేషన్‌ను యూనిట్-1లో జనవరినుంచి, యూనిట్-2లో మార్చినుంచి ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నారు. అదికూడా పూర్తయితే జనవరిలో 600 మెగావాట్లు, మార్చిలో మరో 600 మెగావాట్లు వెరసి.. మార్చికల్లా మొత్తం 1200 మెగావాట్ల విద్యుత్ రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడనుంది.