బీజింగ్, ఆగస్టు 24: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన చైనా మార్కెట్ పతనం ప్రపంచ మార్కెట్లపై దుష్ప్రభావం చూ...
బీజింగ్, ఆగస్టు 24: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన చైనా మార్కెట్ పతనం ప్రపంచ మార్కెట్లపై దుష్ప్రభావం చూపుతున్నది. ఎగుమతులను పెంచుకొనేందుకు చైనా చేసిన ప్రయత్నం ఆ దేశానికి ఉపయోగపడకపోగా, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కకావికలం చేస్తున్నది. యువాన్ విలువను తగ్గించినా చైనా మార్కెట్ మరింత పతనం దిశగా సాగుతున్నదే తప్ప కోలుకునే అవకాశాలు దరిదాపుల్లో కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం షాంఘై సూచి ఎనిమిది శాతానికిపైగా పడిపోయింది.
-బలహీన స్థితికి పడిపోయిన పరిశ్రమల ఉత్పత్తి
-షేర్ల కొనుగోలుపై పట్టు సడలించడంతో అల్లకల్లోలం
-చైనా మార్కెట్ పతనంతో ప్రపంచం కకావికలు
-అనేక దేశాల్లో వణికిపోతున్న స్టాక్‌మార్కెట్లు
-యువాన్ విలువ తగ్గించినా కనిపించని ఫలితం
-చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునేనా?
స్టాక్ మార్కెట్‌ను పతనంనుంచి లేవనెత్తేందుకు చైనా ప్రభుత్వ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మదుపర్లు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవడంతో భారత్‌తోపాటు జపాన్, తైవాన్, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాతోపాటు యూరోపియన్ మార్కెట్లు భారీ నష్టాలను చవివచూశాయి.
గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ మధ్య చైనా షాంఘై సూచి 150 శాతం పెరిగింది. సామాన్య చైనా పౌరులు మొదటిసారిగా స్కాట్ మార్కెట్లో పెట్టుబడులకు ముందుకు రావడంతో సూచి పైకి ఎగబాకింది. స్టాక్ మార్కెట్లో నాలుగు కోట్లకు పైగా కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. వీరిలో చాలామంది అప్పు చేసి షేర్లు కొన్నారు. గతంలో ఇటువంటి విధానాన్ని అనుమతించని చైనా, గత ఐదేండ్లలో పట్టు సడలించింది.
స్టాక్ మార్కెట్ల ఎదుగుదలప్లై అధికారులు ఒకానొక దశలో ఆందోళన కూడా వ్యక్తం చేశారు. జూన్ 12వ తేదీ వరకు పైకి ఎగబాకిన సూచి ఆ తరువాత నేలచూపు చూడటం ప్రారంభించింది. ఈ పరిణామం అటు చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా భయం పుట్టించింది. మార్కెట్ల పతనాన్ని నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ప్రజలకు షేర్లు కొనేందుకు రుణాలిచ్చే చైనా సెక్యూరిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే ప్రభుత్వరంగ సంస్థకు సెంట్రల్ బ్యాంక్ మరింత నగదును విడుదల చేసింది. కంపెనీల్లో ఎగ్జిక్యూటివ్‌లు, బోర్డు సభ్యులు అలాగే ఐదు శాతం కన్నా ఎక్కువ వాటా కలిగిన వారెవరూ తమ వాటాను అమ్మకుండా నిషేధం విధించారు. కంపెనీలు తమ సొంత షేర్లను కొనుగోలు చేయాలని లేదా తమ అధికారులు, ఉద్యోగులు వాటిని కొనుగోలుచేసేలా ప్రోత్సహించాలని చైనా సెక్యూరిటీస్ రెగ్యులేటర్ ఆదేశించింది. ఈ చర్యలు కొన్ని వారాల పాటు కొంత ఉపశమనం కలిగించినా, మార్కెట్ పతనాన్ని మాత్రం నియంత్రించలేకపోయాయి.
పెన్షన్ నిధులను పెట్టుబడి పెట్టేందుకు అనుమతిస్తామని ప్రకటించినప్పటికీ ఎటువంటి ప్రభావం కనిపించలేదు. గత 77 నెలల్లో ఎన్నడూ లేనంత బలహీన స్థితికి పరిశ్రమల ఉత్పత్తి పడిపోయింది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వారు ఆ నష్టాలను పూడ్చుకొనేందుకు మాల్స్ వైపు వచ్చి కొనుగోళ్లు చేయడానికి వెనుకాడతారని, దీంతో ఆర్థిక వ్యవస్థ మరింత పతనం అవుతుందని బీజింగ్‌లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
స్టాక్ మార్కెట్లలో సహజంగా జరగాల్సిన ఉత్థాన పతనాల సర్దుబాటును చైనా ప్రభుత్వం అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ పరిణామానికి కారణమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. స్టాక్ కొనుగోళ్లు, సంస్థాగత హోల్డర్ల అమ్మకాలను నిషేధించడం, పోలీసులను ఉపయోగించి చిన్న విక్రేతలను అడ్డుకొనే చర్యల ద్వారా చైనా నాయకులు తెలివైన పెట్టుబడిదారులను మార్కెట్కుదూరం చేశారు. ప్రపంచ ఎగుమతుల్లో 1990లో రెండు శాతంగా ఉన్న చైనా వాటా 2013నాటికి 13 శాతానికి పెరిగింది. కానీ గత కొంతకాలంగా ఎగుమతులు తగ్గిపోవడంతో ఆర్థిక మందగమనం ప్రారంభమైంది. దీంతో వరుసగా మూడుసార్లు యువాన్ విలువను తగ్గించారు.
యువాన్ విలువను 4.4 శాతం తగ్గించడం వల్ల ఎగుమతులు మళ్లీ పెరుగుతాయని అంచనా వేశారు. అయితే చైనాకు పోటీగా ఇతర దేశాలు కూడా కరెన్సీ విలువను తగ్గిస్తే ఆర్థిక యుద్ధ పరిస్థితులు నెలకొంటాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు అమెరికా త్వరలోనే వడ్డీ రేట్లు పెంచుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే వర్ధమాన దేశాలనుంచి పెట్టుబడులు అటువైపు తరలిపోయే అవకాశాలున్నాయి. దీంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. విదేశీ మారక నిల్వలు అపారంగా ఉన్న చైనా ఈ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోగలదని భావిస్తున్నారు.