ఆధార్‌లోని వేలిముద్రలతో సరిపోతేనే పరీక్షకు అనుమతి అన్ని కేంద్రాలూ ఆన్లైన్లో పర్యవేక్షణ సుప్రీం, యూపీఎస్సీ ఆదేశాల మేరకు ఏర్పాట్లు పా...
- ఆధార్‌లోని వేలిముద్రలతో సరిపోతేనే పరీక్షకు అనుమతి
- అన్ని కేంద్రాలూ ఆన్లైన్లో పర్యవేక్షణ
- సుప్రీం, యూపీఎస్సీ ఆదేశాల మేరకు ఏర్పాట్లు
- పారదర్శకత కోసం టీఎస్పీఎస్సీ భారీ కసరత్తు
హైదరాబాద్ష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించబోతున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీటిపై తనదైన ముద్ర వేయబోతోంది. అవినీతి, అవకతవకలకు ఆస్కారం లేకుండా చూసేందుకు ఉద్యోగ పరీక్షల్లో బయోమెట్రిక్ విధానం, ఆన్లైన్లో పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ వంటి సరికొత్త విధానాల్ని అనుసరించబోతోంది. పరీక్ష నుంచి ఇంటర్వ్యూల వరకు పూర్తి పారదర్శకంగా ఉండేందుకు టీఎస్పీఎస్సీ భారీ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. సాంకేతికత దన్నుతో పరీక్షల్లో మోసాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ వ్యాపం కేసు, అఖిల భారత వైద్యవిద్య ప్రవేశపరీక్షల్లో లీకేజి అనుభవాల నేపథ్యంలో సుప్రీంకోర్టు, యూపీఎస్సీ ఇచ్చిన ఆదేశాలు, సూచనలను ఇక్కడ ఉద్యోగ భర్తీల్లో అనుసరించబోతున్నారు.ఇందులో భాగంగా దరఖాస్తు దశలోనే అభ్యర్థుల ఆధార్ సంఖ్యను తీసుకుంటున్నారు. ఒకేసారి నమోదు (ఓటీఆర్)లో దరఖాస్తు చేసుకుంటున్నవారంతా ఆధార్‌ను సమర్పిస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 2లక్షల మంది టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఓటీఆర్ ద్వారా నమోదు చేసుకున్నట్లు సమాచారం. ప్రతి పరీక్ష కేంద్రంలో బయోమెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టాలన్నది టీఎస్పీఎస్సీ ఆలోచనగా తెలిసింది. ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాయకుండా, నియామకాల సమయంలోనూ ఇబ్బందుల్లేకుండా ఉండటానికి ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు. ఆధార్ నమోదు సందర్భంగా తీసుకున్న వేలిముద్రతో అభ్యర్థి వేలిముద్ర సరిపోతేనే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష కేంద్రాలను కూడా ఎక్కడపడితే అక్కడ కేటాయించకుండా జాగ్రత్తపడుతున్నారు. కమిషన్ బృందాలు ఇప్పటికే అన్ని జిల్లాల్లో పర్యటించి పరీక్షల నిర్వహణకు అనుకూలంగా ఉన్న కేంద్రాలను పరిశీలించినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలను హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో పర్యవేక్షించినట్లే పరీక్ష కేంద్రాలను కూడా పర్యవేక్షించబోతున్నారు. ఎక్కడా అవతకవకలకు ఆస్కారం లేకుండా ఈ ఏర్పాటు చేస్తున్నారు. చేతి గడియారాన్ని కూడా అనుమతించరు.ప్రశ్నలొక్కటే.. వరుసక్రమం వేరు: పరీక్షపత్రాల రూపకల్పనలోనూ గతంకంటే భిన్నమైన పద్ధతుల్ని అనుసరించబోతున్నట్లు తెలిసింది. అభ్యర్థులందరికీ ఇచ్చే ప్రశ్నలు ఒకటే అయినా వాటి వరుసక్రమం వేర్వేరుగా ఉండేలా చూస్తున్నారు. ఎవరైనా ఆధునిక పద్ధతుల్లో కాపీ కొట్టాలని, మోసం చేయాలని ప్రయత్నించినా వీలుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటర్వ్యూ విషయంలోనూ సభ్యుల ఎంపిక నుంచి నిర్వహణ వరకు పారదర్శకంగా జరిగేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.