మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన శ్రీమంతుడు చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాణం నుంచే ఈ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లో అటు ట్...
మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన శ్రీమంతుడు చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాణం నుంచే ఈ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లో అటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్‌బాబుకు కమర్షియల్ సక్సెస్‌లు కొత్తేమీ కాదు. పోకిరి దూకుడు చిత్రాలు రికార్డు కలెక్షన్లతో టాలీవుడ్ బాక్సాఫీస్‌కు కొత్త గ్రామర్ని అద్దాయి. అయితే మహేష్‌బాబు గత చిత్రాలు వన్ ఆగడు కొంత నిరుత్సాహపరచడంతో శ్రీమంతుడు చిత్ర విజయంపై అభిమానులు భారీ ఆశల్ని పెట్టుకున్నారు.
అందుకు అనుగుణంగానే ఈ సినిమాపై మహేష్‌బాబు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. నిర్మాణంలో కూడా ఆయన భాగస్వామి కావడంతో మరింత బాధ్యతతో సినిమా కోసం శ్రమించారు. ఊరిని దత్తత తీసుకోవడం అనే సామాజిక నేపథ్యం కలిగిన కథాంశం కావడంతో సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా ఆసక్తిని కలిగించింది. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇక ఓవర్సీస్లో మహేష్బాబుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్క అమెరికాలోనే దాదాపు 160కిపైగా థియేటర్లలో శ్రీమంతుడు చిత్రం విడుదలవుతోంది. తమిళంలో సెల్వందన్ పేరుతో ప్రేక్షకులముందుకొస్తోంది. మహేష్‌బాబు కెరీర్లో తెలుగు, తమిళభాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న చిత్రంగా శ్రీమంతుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చిత్రం ఉభయ తెలుగురాష్ర్టాల్లో తొలిరోజు 20 కోట్లకుపైగా కలెక్షన్స్ వసూలు చేయొచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద శ్రీమంతుడు సరికొత్త సంచనాలన్ని సృష్టిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సి.వి.ఎం), కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కొరటాల శివ.